పసుపు బోర్డ్, గిరిజన యూనివర్సిటీ : మోడీ నుంచి ఈ షాకులు ఎక్స్‌పెక్ట్ చేసి వుండరేమో

 



PM Narendra Modi Telangana visit :

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులకు సైతం షాకిచ్చింది. ఆయన తెలంగాణకు ఎన్నోసార్లు వచ్చారు , వెళ్లారు. ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు ‘‘తెలంగాణకు మరోసారి రిక్త హస్తం ’’ అంటూ ప్రచారం మొదలెట్టేవారు. కానీ ఈసారి మోడీ వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచేలా పసుపు బోర్డ్, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రకటనలు చేశారు. 

తద్వారా బీఆర్ఎస్‌కు చెక్ పెట్టారు ప్రధాని. ఆయన నోటి వెంట ఆ ప్రకటన వస్తుందని సొంత పార్టీ నేతలు సైతం ఊహించి వుండరు. వేదికపై వున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు సైతం ఆశ్చర్యపోయారు. మోడీ మాటల తర్వాత వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కూడా పెద్దగా కౌంటర్లు లేవు . మంత్రి కేటీఆర్ మాత్రమే స్పందించారు. రేపు అధికార పార్టీ నేతల ప్రెస్‌మీట్‌లు వుండే అవకాశం వుండొచ్చు.


మోడీ పర్యటనతో కాషాయ దళంలో కొత్త జోష్ :

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా విజయవంతంగా పార్టీని నడిపిస్తున్న బండి సంజయ్‌ని అనూహ్య పరిణామాల మధ్య అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. నాటి నుంచి తెలంగాణ బీజేపీలో నైరాశ్యం కమ్ముకుంది. అధికార పార్టీపై కయ్యానికి కాలు దువ్వేవారు బండి సంజయ్ . ఆయనను చూసుకుని శ్రేణులు కూడా రెచ్చిపోయేవి.. దీంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. 

కానీ ఎప్పుడైతే సంజయ్‌కి బదులుగా కిషన్ రెడ్డి వచ్చారో నాటి నుంచి రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు చప్పగా సాగుతున్నాయి. 115 మందితో ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించి కేసీఆర్ షాకిచ్చారు. దీని నుంచి కాంగ్రెస్ వేగంగా తేరుకుని అభ్యర్ధుల కసరత్తు ప్రారంభించింది. నేడో రేపో అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం వుంది. కానీ బీజేపీలో మాత్రం ఆ వాతావరణం కనిపించడం లేదు. 

బీజేపీలో మాయమైన జోష్ :

టికెట్ల  కోసం భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ వారిలో జనానికి తెలిసినవారు, ముఖ పరిచయం వున్న నేతలు చాలా తక్కువ. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో టికెట్లు దక్కని అసంతృప్తులను ఇటుపక్కకి లాగి వారికి బీ ఫాం ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి వారు శ్రమిస్తున్నా పార్టీకి అంతగా ఊపు రావడం లేదు. ఈ దశలో మోడీ తెలంగాణకు వచ్చారు. మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. 

ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. కేంద్రం చేపట్టే ప్రాజెక్ట్‌లతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ చేతుల్లో వుందని.. అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన ఆ రెండు కుటుంబాలు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని.. అందులో డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ అన్ని పదవులు ఆ కుటుంబానివేనని మోడీ చురకలంటించారు. 

త్వరలో తెలంగాణకు క్యూ కట్టనున్న జాతీయ నేతలు :

మోడీ పర్యటన ఇచ్చిన జోష్‌తో తెలంగాణలో పార్టీ కేడర్ మరింత చురుగ్గా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు నిస్తేజంగా వున్న పార్టీలో ఒక్కసారిగా జోష్ రావాల్సిన అవసరం వుంది . ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలకు ఎక్కువ రోజులు సమయం లేదు. ఈ రేసులో వెనుకబడిపోతే.. ప్రజలకు రానున్న రోజుల్లో బీజేపీపై నమ్మకం సన్నగిల్లే అవకాశం వుంది. దీనిని గమనించిన కమలనాథులు నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో కేంద్ర పెద్దలు తెలంగాణకు క్యూకట్టనున్నారు. 


Comments